అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!



పురుషుడి స్వభావం ఆధారంగా స్త్రీ తన స్వభావాన్ని మార్చుకుంటుంది, మార్చుకోవాలి..అదే అర్థనారీశ్వర తత్వం. అలా ఉండడం వల్లే పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు అయ్యారు.

పంచభూత క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా క్షేత్రాల్లో స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు శాంత స్వరూపిణిగా కొలువై ఉంటారు.. శంకరుడు శాంత రూపంలో ఉంటే పార్వతీ మాత ఉగ్రరూపంలో ఉంటుంది.


అరుణాచలం – అగ్నిలింగం


ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో కనిపిస్తారు. అందుకే -అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు.

జంబుకేశ్వరం- జలలింగం


జంబుకేశ్వరంలో శివుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువై ఆగ్రహంగా కనిపిస్తుంది. స్త్రీ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి ఏ పురుషుడికి లేదు..అది కేవలం పిల్లల వల్లనే సాధ్యం…అందుకే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం ఉంటుంది.


కంచి – పృథ్వి లింగం


కంచిలో సైకత లింగం. ఇసుక లింగం అంటే ఎంత సున్నితంగా ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదా. ఇంత సున్నితమైన భర్తని కాపాడుకోవాలంటే భార్య కఠినంగానే ఉండాలి మరి. ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో..భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.

చిదంబరం – ఆకాశలింగం


చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటుంది. అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పేందుకు సంకేతం ఇది.


శ్రీకాళహస్తి – వాయులింగం


వాయువు వేగానికి ప్రతీక ఆ వేగాన్ని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు..అందుకే ఇక్కడ స్వామివారికి తగ్గట్టుగా అమ్మవారు ప్రశాంతంగా జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది.

స్వామి మనోగతం తెలుసుకుని గౌరిగా మారిన కాళి


గౌరీ దేవిగా కనిపించే అమ్మవారు తెల్లగా కనిపిస్తున్నట్టు చిత్రాలు ఉంటాయి…కాళికా దేవి నల్లగా కనిపిస్తుంది. వేదపరిభాషలో తెలుపు అంటే శాంతం.. నలుపు అంటే కోపం. ఓ సందర్భంలో అమ్మవారి కోపాన్ని గ్రహించిన స్వామివారు….కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళి…తపస్సు చేసి శాంతస్వరూపిణి అయిన గౌరిగా మారిందని చెబుతారు. అంటే స్థిరచిత్వం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ స్త్రీలో మార్పులు ఉండాలన్నదే అర్థనారీశ్వర తత్వం అసలైన అర్థం. అందుకే ధర్మశాస్త్రంలో స్త్రీకి ఉండే నియమాలు పురుషుడికి ఉండవ్.

పురుషుడు స్థిరం – స్త్రీ మాయ!


సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది. మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో.. పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం. బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది. ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు. వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు. తన జీవితానికి పరిపూర్ణనతను కల్పించిన భార్యను సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.

Post a Comment

Previous Post Next Post